నా జీవన రాగం

సెప్టెంబరు 25, 2007

RTI సమావేశం

ప్రచురించిన వర్గము social activities — uravishankar @ 11:26 పూర్వాహ్నం

కాలక్షేపానికో వినోదానికోగడిచిపోయే నా ఆదివారం సాయంత్రం ఈ సారి అర్దవంతంగా ఉత్తేజపూరితంగా సాగింది. ఎన్ని సినిమాలు చూసినా ఎంత మంది స్నేహితులతో ఎంత సేపు ముట్టచించినా అదివారం ముగిసేప్పటికి ఏదో Incomplete feeling ఉంటుంది.కాని గడిచిన ఆదివారం మాత్రం ఒక మంచి పని చేసాననే తృప్తి, దానికి కొనసాగించవలసిన బాధ్యత, దానిని నిరవర్తించగలమా అనే సంకోచాలతో ముగిసింది.

ఇక సమావేశ వివరాల్లోకి వెళితే ‘సమాచార హక్కు ‘ని సమర్దంగా వినియోగించిన రాకేష్ దానిని మరింత ప్రచారం లోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. అతి తక్కువ సమయం లో ఈ సమవేశం గురించి ఆసక్తి కలిగిన వ్యక్తులందరికీ తెలియపరిచి TMAD ప్రశాంతి ఇది విజయవంతం అవడానికి ఎంతో శ్రమించారు.

ముందుగా ఈ హక్కు యొక్క అవసరం గురించి తెలుసుకోవలసి ఉంది. ఈ ప్రభుత్వం అనేది ప్రజలది అని, ప్రభుత్వం చేసే ఖర్చు  ప్రత్యక్షంగా కానిపరోక్షంగా గాని మనం కట్టే పన్నుల ద్వారా చేకూరిందే అని మనమందరం గుర్తించాలి. అలాంటప్పుడు మన సొమ్ము ఎలా ఖర్చు అవుతుందో, మన మీద ఆపాదించే ప్రతి పాలసీని ప్రశ్నించే హక్కు ఒక పౌరుడిగా మనకుంది. ఈ హక్కు సామాన్యపౌరుడికి తన హక్కులకోసం ప్రశ్నించే ఒక ఆయుధం.ఎంతో మంది విజ్ఞుల ఫలితంగా అమలు లోకి వచ్చిన ఈ హక్కును సమర్దంగా వినియోగించినప్పుడే వారి కృషికి సఫలత్వం కలుగుతుంది. ముఖ్యంగా విద్యావంతులమంతా దీని ప్రాముఖ్యతను గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ చట్టం హక్కుతో పాటు దానిని వినియోగించాల్సిన బాధ్యత మనముందు ఉంచింది.

ఈ సమావేశంలో RTI అప్లికేషన్లు పెట్టిన వ్యక్తుల అనుభవాలు వినడం జరిగింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి, ఎంతో సమయాన్ని సహనాన్ని వెచ్చించి, తన స్వలాభాన్ని విడిచి, ఎంతో మంది ప్రభుత్వాధికారులను ప్రశ్నించి సత్ఫలితాలను సాధించిన రాకేష్ మరియు అతని టీం ను ఎంతో అభినందించవలసి ఉంది. నాగేంద్రబాబు గారు RTI సంబంధించి గత కొద్ది కాలం లో జరిగిన మంచి పరిణామాలను వివరించారు. ప్రభుత్వ రంగ పనితీరు గురించి అనుభవంతో కూడిన ఆయన ప్రసంగం ఎంతో స్పూర్తిని ఇచ్చింది. సమాజం అనేది మన కుటుంబానికి కొనసాగింపేనని మన చుట్టూ జరిగే అన్యాయానికి స్పందించడం మనందరి భాధ్యత అని గుర్తు చేశారు.

ఈ ‘సమాచార హక్కు ‘ బాగా ప్రాచుర్యం లోకి వచ్చి సామాన్య పౌరుడు సైతం నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినపుడు మన ప్రభుత్వ పనితీరులో తప్పక మార్పు వస్తుందని మనం ఆశించవచ్చు.

రవి.

సెప్టెంబరు 22, 2007

‘కొండ వాగులో బంతి ‘ కి నా స్పందన

ప్రచురించిన వర్గము Kadha kalakshepam — uravishankar @ 2:45 అపరాహ్నం

ఏమీ పని పాట లేకుండా కూర్చున్న నాకు మూలా సుబ్రమణ్యం గారి మూలాన నాకు ఒక పరిచయం లేని ఒక కొత్త పని చేద్దామని ఆలోచన వచ్చింది. దాని రూపమే ఈ ‘ బ్లాగు ‘.

ఈరోజు ఆయన రాసిన కొత్త కధ ‘కొండ వాగులో బంతి ‘ ని చదివే అవకాశం, ఆయన ద్వారానే కలిగింది. తనతో నాకు పెద్ద పరిచయం లేక పోయినా తను రాసిన ‘ఏటిఒడ్డున ‘ కవితా సంపుటి నాకు ఒక ప్రత్యేక అభిమానం కలుగ చేసింది.

 ఇక ఈ కధ విషయానికి వస్తే, ఇద్దరు ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తుల మధ్య నడిచే కధ.ఒక ప్రేమ కధగా మొదలయ్యి కుంచం వేదాంత ధోరణి లోకి వెళ్ళి మళ్ళీ ప్రేమ కధగా ముగిసింది. దీనికి కొనసాగింపు ఉందేమో అని అనిపించింది. సుబ్బు గారే చెప్పాలి.

జీవితంలో ఎన్నో పరిచయాలు అవుతుంటాయి కాని అందులో కొన్ని మాత్రమే గొప్ప స్నేహాలు మారతాయి.కాలక్షేపానికో ఒకరి గొప్పలు ప్రదర్శించుకోడానికో కలిసే సావాసాలు చూస్తుంటాం కాని ఒకరి పురోగమనానికి తోడ్పడే స్నేహాలు చాలా అరుదు. అలాంటి ఒక అపురూపమైన స్వచ్చమైన స్నేహాన్ని ఈ కధ లోని పాత్రల మధ్య గమనించవచ్చు. ఒకే విషయాన్ని ఆశా వాది, నిరాశా వాది చూసే దృక్పదం వేరేగా ఉంటుంది. ప్రతి మనిషిలోను ఒక ఆశా వాది నిరాశా వాది ఉంటారు. ఆ ఆశావాది ని ఎక్కువ ప్రొత్సహించే వాడే నిజమైన స్నేహితుడు.

ఈ కధలోని పాత్రలు రెండూ తమకి తాము నిజాయితీగా ఉండే ఇద్దరు వ్యక్తులు. కధలో సంఘటనలకి అంత ప్రాముఖ్యం లేకపొయినా రవి, హిమబిందు పాత్రల మధ్య నడిచిన సంభాషణలు పాఠకులను ఆలో చింపచేసే విదంగా ఉంటాయి.  ముఖ్యంగా కొన్ని వాక్యాలు ‘రేపే మృత్యువు నా తలుపు తడుతుందని ఊహించుకొని ఇవ్వాళ గడపడం నాకు అన్నిటి కన్నా ఇష్టమైన పని ‘ లాంటివి ఒక మంచి సందేశాన్ని అందిస్తాయి.

మధ్య మధ్యలో ప్రకృతిని వర్నించిన తీరు హృదయాన్ని తేలిక పరిచింది. ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి భావుకత్వం తో నిండిన రచనలు చూసినప్పుడు ఏదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది.

ఏమంటారు??

సుబ్బు గారు.. మీరిలాంటి రచనలు మరెన్నో చేయాలని నా కోరిక

రవి శంకర్

WordPress.com లో Blog పెట్టుము.