మొబైల్ వాడుతున్న గత కొన్ని సంవత్సరాలలో ఎన్నో సార్లు ఒంటరిగా ఉన్నా ఒంటరితనాన్ని పూర్తిగా అనుభవించలేదు. మాటల రూపంలో కావలసిన వారందరూ పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు వీధికి రెండు మూడు టెలిఫోన్ బూతులు ఉండేవి. ఇప్పుడన్నీ ఆ డబ్బా ఫోనులే. మాట్లాడడం మొదలెట్టానో లేదో కుయ్యి కుయ్యిమంటుంది ఇంకో కాయిన్ వెయ్యమని. ఇవ్వాళ ఒక చిన్న సమాచారం చేరవేయడానికి ఇంట్లో చిల్లర అంతా కూడకొట్టుకొని కూడా నానా యాతనలు పడ్డాను.మొబైల్ లేక నేను పడిన ఈ చిన్న చిన్న ఇబ్బందులు నా చేత ఈ చిన్న బ్లాగు రాయించాయి.
ఈ మొబైల్ రాకముందు ఎవరన్నా స్నేహితులను ఎక్కడన్నా కలుసుకోవాలంటే పలానా సెంటర్ లో పలానా హొటల్ దగ్గర ఉంటామని ఖచ్చితంగా అనుకొనేవాళ్ళం. వాడు కొంచెం పక్కకి వెళ్ళినా వెతికే వాడికి శిరోభారమే. ఇప్పుడు పలానా చోట ఉన్నారంటే నడుస్తూ మాట్లాడుతూనే కలుసుకోవచ్చు. నా చిన్నప్పుడు నా గ్రామంలో ఎవరికన్నా ఏమైనా విషయం చేరవేయాలంటే అటుగా వెళ్ళే పిన్ని గారినో, మామ గారినో కబురంపమని అడిగేవాళ్ళం. ఇప్పుడంతా నిమిషాలలో పని. సాంకేతికత గ్రామాలకు సైతం విస్తరించింది కదా.
సాంకేతికత బాగా పెరగడం వళ్ళ మనుషులు దగ్గరయ్యారు కాని మనసులు మాత్రం దూరమయ్యాయి అనిపిస్తుంది. దీనికి పూర్తిగా సాంకేతికతను నిందించడం తగదు. మారుతున్న విలువలే ప్రధాన కారణం. ఈ మధ్య పెళ్ళి ఆహ్వానాలన్నీ e-mails లోనే వస్తున్నాయి. అలాంటి ఆహ్వానం చూస్తే పెళ్ళికి వెళ్ళాలా వద్దా అనే సంశయం కలుగుతుంది. మనం ఒక పనైపోతుంది కదా అని ఇలా e-mail ఆహ్వానాలు పంపుకుంటున్నామేమో. కనీసం పెళ్ళయినా ఒక పనయిపోతుందని కాకుండా మనస్ఫూర్తిగా జరుపుకొంటే బావుంటుంది. ఇది ఎవరినీ విమర్శించడం కాదు కాని మన సమాజం ఏ దారిలో వెళ్తుందా అని పరిశీలించుకోవడం మాత్రమే.
రవి
రవి గారూ బాగా రాశారు. ఫోన్లు మనుషులను దగ్గర చేసినట్లు అనిపించినా అంతకుముందు మనుషుల మధ్య ఉండే సున్నితమైన ఆప్యాయతలు మాత్రం ఈ మధ్య కనిపించడం లేదు. ఒకసారి వెళ్లివస్తే, ఒక ఇన్ లాండ్ లెటర్ రాస్తే, నెలకోసారి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని ఫోన్ చేసుకుంటే లభించిన తృప్తి ఈరోజుల్లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నా రావడం లేదు. అతి సర్వతా వర్జయేత్ అంటే ఇదేనేమో!
- నల్లమోతు శ్రీధర్
http://computereras.blogspot.com/
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నల్లమోతు శ్రీధర్ — నవంబరు 25, 2007 @ 3:29 అపరాహ్నం