గత కొద్ది కాలంగా నేను చదివిన పుస్తకాలలో నన్ను బాగా ప్రభావితం చేసినది ‘ATLAS SHRUGGED’. నా జీవన శైలిని, తోటి వారితో నా సహ జీవనాన్ని, బాల్యం నుంచి నాలో నాటుకు పోయిన కొన్ని భావాలని సూటిగా ప్రశ్నించింది ఈ పుస్తకం. మనిషి ఆకలి కంటే మరేదీ పెద్ద సమస్య కాదు అనుకొనే వాడిని కాని ప్రతి మనిషి తన సామర్ధ్యం మీర ఆలోచిస్తే ఆకలి సమస్యే కాదు .సంతోషం మనిషి నైతిక హక్కు అంటుంది అయన్ ర్యాండ్. కొన్ని పేజీలు చదివి ఆ భావ తాకిడి కి తాళ లేక, పుస్తకం ప్రక్కన పెట్టి కాసేపు ఆలోచించి మళ్ళీ తెరిచిన సంధర్భాలు ఉన్నాయి. నా తలకు మించిన వేదాంతమేదో నాకు మధ్యలో విసుగనిపించినా పుస్తకం చివరివరకూ ఆలోచింపచేసేదిలా ఉంది. అయన్ ర్యాండ్ గారి తత్త్వం తక్కిన వాటి కన్నా విపులంగా ఇందులో వివరింపబడింది అని నా అభిప్రాయం. జీవితంలో ఎదగాలనుకొనే ప్రతి వ్యక్తికీ ఉత్సాహాన్ని నిలిపే పుస్తకం ఈ ‘ATLAS SHRUGGED’.
ప్రతి మనిషీ తనకు తానే దిశా నిర్దేశం చేసుకోవాలి అనేది దీని నుంచి నేను నేర్చుకొన్న ఒక నీతి. దర్శకుడు రాంగోపాల్ వర్మ గారిని పలు ప్రశ్నోత్తరాలలో ప్రేక్షకులకు ఏమయినా సలహా ఇమ్మంటే ఎవరినీ సలహా అడగద్దనేదే నా సలహా అనేవారు. పొగరుగా అనిపించే ఈ సమాధానం వెనుక తత్త్వమేమితో ఈ పుస్తకం వివరిస్తుంది. తమ కృషి, పట్టుదల, మేధస్సుతో సమాజానికి వెన్నెముకలా ఉండే కొందరు వ్యక్తులకు ముందరకాళ్ళ బంధంలా కొన్ని శక్తులు అడ్డు పడుతుంతే వాటిని ఎలా ప్రతిఘటించాయనేది దీని ఇతివృత్తం. సామర్ద్యం కనబరిచిన వాడికి ప్రోత్సాహకాలు లేకుండా ప్రతివాడికీ సమాన హక్కులంటూ సమాజాన్ని పరాన్న జీవుల్లా మార్చే ప్రభుత్వంతో విసుగు చెందిన కొంతమంది వ్యక్తులు సమాజాన్నే వెలి వేస్తే సమాజం ఎలా అలకల్లోలం అవుతుంది అనే ఆలోచన ఈ కధ కి మూలం. నైతికత ముసుగులో మనిషి శక్తి సామర్ద్యాలని నిర్వీర్యం చేసే మతాలను, సిద్దాంతాలను ఘాటుగా విమర్శిస్తుంది. మనిషి తన ఉనికి ఉన్నంతకాలం తన తర్కంతో తనకు తాను ముందుకు నడవాలని బోధిస్తుంది.
ఈ నవల చదివేప్పుడు కమ్యూనిజం అంటే వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. కాని ఇందులోని ఊహాజనిత సమాజానికి వాస్తవిక పరిస్తితుల మధ్య తేడా ని గమనించాలి. ముఖ్యంగా పుట్టుకతోనే ఆపాదించబడుతున్న అసమానతలు తొలగి సహజంగా మనిషి బుద్ధి వికసించడానికి తోద్పడే వాతావరనాన్ని సృష్టించుకోగలిగితే మనం నవల లోని ఆదర్శ ప్రపంచానికి తలుపులు తెరుచుకొంటాయి. ఈ అంతరాన్ని పూరించడానికి, ఒక సమాన మయిన వేదిక కల్పించడానికి మన ప్రభుత్వాలు విధానాలు నిర్నయించాలి కాని పోటీ వాతావరణం ఉన్నప్పుడే సమాజం ఏ రంగంలో నైనా ప్రగతి పధంలో ముందుకు వెళ్తుంది. ఎవరి ఆకలి వారు తీర్చుకోడానికి ఆసరాగా ఉండే వ్యవస్థ మనకి కావాలి కాని ఆకలి తీర్చే వ్యవస్థ మనకి వద్దు. ఉన్నా అది దీర్ఘ కాలం లో నిలబడదు.
సమాజం ఈ నవలలో లా ఉండాలి అని నిర్దిష్టంగా చెప్పలేను కాని ఒక వ్యక్తి మాత్రం ఇందులోని ‘JOHN GALT’ లా ఉండాలని చెప్పగలను.
RAVI